Tirupati Municipal Corporation :395 కోట్లతో తిరుపతి నగరపాలక సంస్థ బడ్జెట్ ఆమోదం.. మేయర్ శిరిషా

Tirupati Municipal Corporation : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 395 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్  తీర్మానాన్ని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శనివారం ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హల్లో మేయర్ శిరిష అధ్యక్షతన, కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి హాజరుకాగా, కమిషనర్ అనుపమ అంజలి బడ్జెట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.

కౌన్సిల్ సభ్యులను వుద్దేశించి కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగర ప్రజల అభివృద్దికి సరైన సమయంలో పన్నులు వసూలుతోబాటు, తిరుపతి కార్పొరేషన్ కి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ రానున్న ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ రాబడి 150 కోట్ల 27 లక్షలు, మూలధన రాబడి 238 కోట్ల 98 లక్షలు, ప్రస్తుత ప్రారంభ నిల్వ 6 కోట్ల 55 లక్షలతో కలిపి 395 కోట్లతో అంచనా వేసి కౌన్సిల్ ఆమోదం పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా 392 కోట్లతో ఖర్చు చేసేందుకు బడ్జెట్ ను ఆమోదించడం జరిగిందన్నారు. మేయర్ శిరిష మాట్లాడుతూ శెట్టిపల్లి పంచాయితి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్లో విలీనం కావడానికి ప్రత్యేక కృషి చేసిన ఎమ్మెల్యే భూమనకు, డిప్యూటీ మేయర్ అభినయ్ కి కౌన్సిల్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

స్టాండింగ్ కమిటి సభ్యులు, కార్పొరేటర్ ఎస్.కె.బాబు మాట్లాడుతూ తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు వున్నాయని వాటికి పన్నులు విధించడంతో కార్పొరేషన్ కి ఆదాయం పెరుగుతుందన్నారు. దిగువ స్థాయి, మధ్య తరగతి ప్రజలు ఖాళీ స్థలాలను కాకుండా బడా స్థాయి వ్యక్తులకు చెందిన ఖాళీ స్థలాలకు పన్నులు ఖచ్చితంగా విదించాలని కోరడంతో, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ,  కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఈ అంశంపై మాట్లాడాలని చెప్పడంతో కమిషనర్ అనుపమ స్పందిస్తూ పెద్ద స్థాయిలో వున్న ఖాళీ జాగాలను గుర్తించి పన్నులు విదిస్తామన్నారు. అదేవిధంగా ఖాళీ జాగా పన్నులు కట్టకుండా వుండే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరుతూ సబ్ రిజిస్టర్ వారిని కోరుతామన్నారు.

మరో కార్పొరేటర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో  ఇంటి నిర్మాణ ధరఖాస్తులకు డెవెలప్‌మెంట్ చార్జీలు 14 శాతాన్ని ప్రభుత్వ నిబంధనలు మేరకు ఖచ్చితంగా వసూలు చేస్తే కార్పొరేషన్ కి ఆదాయం పెరుగుతుందని చెప్పడంతో, తగిన ఆదేశాలు జారీ చేస్తామని మేయర్ డాక్టర్ శిరిష, కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు సునీత, చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, తిరుమాలిక మోహన్, కె.ఎల్.వర్మా, సెక్రటరీ రాధిక, ఇతర అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ వివరాలను సభ్యులకు అర్థమయ్యేలా వివరించిన మేనేజర్ చిట్టిబాబును కౌన్సిల్ సభ్యులు అభినందించారు.

News Tags: