
భారత ఉప ఖండంలో వెలసిన అష్టాదశ శక్తి పీఠాల్లో చాముండేశ్వరి ఆలయాన్ని 4వ శక్తి పీఠంగా చెబుతారు. ఇక్కడ అమ్మవారి కేశాలు పడ్డాయంటారు. మైసూరు, చాముండి కొండల్లో వెలసిన చాముండిదేవికి ఈ దసరా పర్వ దినాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. కర్ణాటక, మైసూరులో ప్రస్తుతం మనకు తెలిసిన చాముండి కొండను ఒకప్పుడు మహాబల గిరిగా పిలిచేవారు. 1659 వరకు అతితక్కువ సదుపాయాలున్న ఈ దేవాలయాన్ని ఆ తరువాతి కాలంలో మైసూరును పాలించిన దొడ్డ దేవరాజ ఒడెయార్ అభివృద్ధి చేశారు. క్రమంగా మైసూరు రాజ వంశస్థుల కులదేవతగా, మైసూరుకు నాడ దేవత(గ్రామ దేవత)గా చాముండి దేవి నిత్య పూజలు అందుకుంటోంది.
ఏటా మైసూరు మహారాజు వంశస్థులతోపాటు, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. చాముండి అమ్మవారికి చండీ హోమం, వెండి రథోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయి. కాళికాదేవి ప్రతిరూపంగా ఉండే చాముండి దేవి తామస గుణ వదనంతో కనిపిస్తుంది. అష్టకరముల్లో ఆయుధాలను ధరించిన దేవిని చంపక పుష్పాలతో అలంకరిస్తారు. ఈ నవరాత్రులలో రోజు సాయంత్రం మహారాజుల కుటుంబ సభ్యులు అత్యంత నిష్టగా పూజలు చేస్తారు.