ఏకాంతంతో ప్రపంచాన్ని గెలిచి...నిశ్శబ్ధంతో తనను తాను గెలిచి

ఏకాంతం, నిశ్శబ్దం... చాలా ముఖ్యమైన స్థితులు. సాధకులకే కాదు. నిజానికి ప్రతి మనిషికీ ఆ రెండూ బాగా అవసరమైనవే! ఈ ప్రపంచం బారినుంచి మనిషిని రక్షించేది ఏకాంతం; 'నేను' నుంచి రక్షించేది నిశ్శబ్దం! అంటే ఏకాంతం బాహ్యమైనది, నిశ్శబ్దం మనిషిలోపలిది. ఆ రెండూ బాగా అనుభవమైతేనే మనిషికి విముక్తి. ఈ ప్రపంచంనుంచి మాత్రమే కాదు, తననుంచి సైతం తాను విడిపోయినప్పుడే మనిషికి నిజమైన ముక్తి.

'నిన్ను నువ్వు తెలుసుకో' అన్న ఉపనిషత్తు బోధనకు మొదటి సాధనం ఏకాంతం. మనలో చాలామంది ఏకాంతమంటే- ఎవరితో కలవకుండా ఒక్కడూ విడిగా ఉండటం అనుకుంటారు. అది ఒంటరితనం కూడా కావచ్చు. ఈ ప్రపంచం వెలివేసిందనుకోండి- మనిషికి విడిగా ఉండవలసిన అగత్యం ఏర్పడుతుంది. అప్పుడది ఏకాంతంకాదు- ఒంటరితనం! శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలను సాధించి, దేశవిదేశాల్లో విఖ్యాతుడైన డాక్టర్ రాజా రామన్నను 'మీ జీవితపు అమూల్య సన్నివేశాల్లో మిక్కిలి ఆనందాన్నిచ్చేది ఏది?' అని ప్రశ్నిస్తే- 'నేను ఏకాంతంగా కూర్చుని పియానో వాయించుకునే సందర్భాలు నాకు ఎంతో సంతోషాన్నిస్తాయి' అన్నారు. ఏకాంతం తన గురించి తాను తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. అది ఒకానొక ఆనందకరమైన ప్రయాణం.

ఒంటరితనం అలాక్కాదు. ప్రపంచాన్నుంచి దూరం అయినందుకు నిత్యం దుఃఖంతో బాధపడుతుంది. దానికి కారకులైన వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. దానికి కారణాలు అన్వేషిస్తుంది. వారి దుర్గుణాలు గుర్తుచేసుకుంటుంది. ప్రతీకారానికి దారులు వెతుకుతుంది. మొత్తంమీద ప్రయాణమంతా భారంగా, దుఃఖపూరితంగా సాగుతుంది. ఇంకొకరి గురించి నిరంతరం ఆలోచిస్తూ గడపడం నిజానికి పెద్దశాపం! ఒక్కమాటలో చెప్పాలంటే- ఏకాంతం జ్ఞానధాతువు, ఒంటరితనం దుఃఖహేతువు! కనుకనే రుషులు, జ్ఞానులు ఏకాంతాన్ని గట్టిగా కోరుకుంటారు.

నిశ్శబ్దంగా ఉండటమంటే మౌనం పాటించడమని పొరబడతారు చాలామంది. నిశ్శబ్దంలో మౌనం ఒక భాగమేకాని, నిశ్శబ్దమంటే మౌనం ఒకటే కాదు. అనేక భాషల్లో గొప్ప పండితుడైన ఆచార్య వినోబాభావేకు అనవసరమైన ముచ్చట్లంటే ఇష్టం ఉండేది కాదు. ఒకసారి పాత్రికేయ బృందంలో అనేక భాషలవారు ఉండటం గమనించి, 'మీతో ఏ భాషలో సంభాషిస్తే అనుకూలంగా ఉంటుంది?' అని వినోబా ప్రశ్నించారు. ఒకాయన లేచి 'మీకు బాగా ఇష్టమైన భాషలో మీరు మాట్లాడవచ్చు. మేం దాన్ని అర్థం చేసుకోగలం' అని గడుసుగా సమాధానం చెప్పాడు. వెంటనే వినోబా 'నాకు చాలా ఇష్టమైనది మౌనభాష' అంటూ కళ్లు మూసుకుని మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటికి విమానం బయలుదేరుతోందన్న ప్రకటన విన్నాక- చిరునవ్వుతో పత్రికలవారినుంచి శలవు తీసుకుని మౌనంగా నిష్క్రమించారు.

 మౌనం కూడా ఒక భాషేనా అంటే- అనుభవజ్ఞులు అవుననే చెబుతారు. 'మామూలు భాషకూడా కాదు, చాలా శక్తిమంతమైనది' అంటారు. అందుకే ప్రార్థనను 'మౌనసంభాషణ' అంటారు.

వినోబాభావే విషయంలో అది మౌనమే గాని, నిశ్శబ్దం కాదు. మౌనంలో మాటల్ని నిరోధించడమే ఉంటుంది. ఆలోచనలను సైతం నిరోధించగలిగితే- అది నిశ్శబ్దం! మౌనం పాటించడం- మనిషి చేతుల్లో ఉంటుంది గాని, అఖండమైన సాధనతో తప్ప లభ్యం కాని అపురూపమైన స్థితి- నిశ్శబ్దం!

నిశ్శబ్దమనేది ఒకానొక గాఢమైన సమాధిస్థితి. ఆలోచనలు కూడా లేని గంభీరమైన శూన్యస్థితి. చిక్కని శాంతి దట్టంగా అలముకున్న ప్రశాంత మధురమైన బ్రహ్మానందస్థితి. సమస్త ఇంద్రియ చైతన్యాలు సమసిపోయి, అంతఃకరణలన్నీ అంతరించిపోయి, అఖండమైన ఆత్మచైతన్యంలో మొత్తం అన్నీ లయమైపోయిన ఒకానొక అద్భుతమైన ఆనందమయమైన స్థితి పేరు నిశ్శబ్దం! ఆ స్థితిలో 'నేను' అనేది ఉండదు. మంచినీటిలో పంచదారలా కరిగి మాయమైపోతుంది.

జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం గాఢమైన ధ్యానస్థితిలోకి ప్రవేశించే క్రమంలో- బుర్రలో ఆలోచనల పరంపర నడుస్తూండగా- ఒక ఆలోచనకు మరో ఆలోచనకు మధ్య కనీసం ఒక లిప్తమాత్రంగానైనా ఆలోచనారహితమైన చిక్కని నిశ్శబ్దస్థితి ఉంటుంది. ఆ పరమ శూన్యస్థితిని క్రమేపీ పెంచుకుంటూ పోవాలని యోగులు సాధన చేస్తారు. 'ఇది ఆలోచనారహిత శూన్యస్థితి' అనే గమనిక సైతంలేని, తోచని దశకు చేరుకుంటారు. కేవలం ఆ స్థితిలో నేను అనేది పూర్తిగా కరిగిపోతుంది. కేవల స్థితిలో దక్కేదే కైవల్యం!

మొత్తం మీద ఏకాంతం ద్వారా ప్రపంచాన్ని గెలిచిన మనిషి- నిశ్శబ్దం ద్వారా తనను కూడా జయిస్తాడు. బయటి ప్రపంచంనుంచి, లోపలి ప్రపంచంనుంచి విముక్తుడవుతాడు.

News Tags: