
రసాయన ఎరువుల వాడకంతో భూసారం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గటమే కాకుండా చీడపీడల భారిన పడుతు రైతులు తీవ్రంగా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. పురుగుమందుల వాడకం వల్ల భూసారం తీవ్రంగా దెబ్బతిని పోషకాల లోపం ఏర్పడుతుంది. పొలాన్ని సారవంతంగా మార్చుకుని పంటలో అధిక దిగుబడులు సాధించుకునేందుకు పచ్చిరొట్ట పైర్ల సాగు అత్యావస్యకం. పొలంలో పంట సాగులో లేని సమయంలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేపట్టాలి. తక్కువ కాల వ్యవధిలో అధిక రొట్టను ఇచ్చే పచ్చిరొట్ట పైర్లను సాగు చేయటం ద్వారా భూమి సారవంతాన్ని పెంచుకోవచ్చు.
పచ్చిరొట్ట పైర్లుగా జనుము, జీలుగ, పిల్లిసెసర, అలసంద, వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. లేత పూత దశలో ఉన్నప్పుడు పంటలను నేలలో కలియ దున్నాలి. అలా చేయటం ద్వారా నేలకు అనేక రకాల పోషకాలు అందుతాయి. భూసారం దెబ్బతినకుండా కాపాడటంతోపాటు, పంటల అధిక దిగుబడి పెంచుకునేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. పాత తరం రైతాంగం ఈ విధాన్ని పాటించటం ద్వారా అధిక దిగుబడులు సాధించేవారు.
పచ్చిరొట్ట పైరుగా జనుము ఎంతగానో దోహదపడుతుంది. ఇది అన్నిరకాల నేలల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 12 కిలోల నుండి 15 కిలోల విత్తనం అవసరమౌతుంది. 6టన్నుల వరకు పచ్చిరొట్ట దిగుబడి వస్తుంది. ఒక టన్ను జనుము పచ్చిరొట్ట 4కిలోల నత్రజని ఉంటుంది. దీని వల్ల భూమిలోపల పోషకాలు పెరుగుతాయి. పశువుల మేతగా కూడా దీనిని వినియోగించుకోవచ్చు.
క్షార గుణం గల చౌడు భూముల్లో , వరి పండించే భూముల్లో జీలుగను పచ్చిరొట్ట పైరుగా సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 12కిలోల విత్తనం అవసరం అవుతుంది. పూతదశలో పొలంలో దీనిని కలియదున్నాలి. ఎకరానికి 10 టన్నుల వరకు పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను జీలుగ నుండి 5కిలోల నత్రజని లభిస్తుంది.
పిల్లిపెసర కూడా పచ్చిరొట్ట ఎరువుగా ఉపకరిస్తుంది. ఎకరానికి 7నుండి 8కిలోల విత్తనం అవసరం అవుతుంది. 4టన్నుల వరకు పచ్చి రొట్ట వస్తుంది. ఇది చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. బరువైన నేలల్లో పిల్లిపెసరను పచ్చిరొట్ట పైరుగా సాగుచేపట్టవచ్చు.అలసంద పచ్చిరొట్ట పైరుగా బాగా ఉపయోగపడుతుంది. ఎకారానికి 6టన్నుల వరకు పచ్చిరొట్ట దిగుబడి వస్తుంది. పూతదశలో ఉన్నప్పుడు పొలంలో కలియదున్నుకోవాలి. టన్ను పచ్చిరొట్టలో 3కిలోలకు పైగా నత్రజని లభిస్తుంది.
పచ్చిరొట్ట పైర్ల సాగు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. భూమి సారవతంగా మారుతుంది. గుల్లగా మారి నేలలోకి వర్షపు నీరు ఇంకిపోయేందుకు దోహదపడుతుంది. పచ్చిరొట్ట ద్వారా నేలకు సేంద్రీయ పదార్ధాన్ని అందిచినట్లవుతుంది. తద్వారా సూక్ష్మజీవులు వృద్ధి చెంది నేల సారవంతం అవుతుంది. జీవరసాయన చర్య జరిగిన పంటలకు అవసరమైన పోషకాలు అంది దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. జీలుగను పచ్చిరొట్ట పైరుగా సాగుచేస్తే వీటి వేర్లు ఎక్కవ లోతుకు వెళ్ళటం వల్ల భూమి పొరల్లో ఉన్న పోషకాలను బయటకు తీసుకువచ్చి పంటలకు అందిస్తాయి.
ప్రధానమైన పంటలను కోసిన వెంటనే నేలలో మిగిలిన తేమను సద్వినియోగం చేసుకునేందుకు పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకోవాలి. జనుము, పిల్లిపిసర, అలసంద వంటివి పచ్చిరొట్ట పైర్లుగా బాగా ఉపయోగపడతాయి. పచ్చిరొట్ట పైర్లు సాగు చేసే సమయంలో విత్తనం మోతాదు ఎక్కవగా చల్లుకుంటే ఎక్కవ మొత్తంలో పచ్చిరొట్ట పొలానికి అందుతుంది.
నీటి వసతి కలిగిన భూముల్లో వేసవిలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. పసుపు, కంది, చెరవుకు వంటి పైర్ల మధ్య భాగంలో ఈ పచ్చిరొట్ట పైర్లను సాగు చేపట్టి పూత దశలో వాటిని కలియదున్నవచ్చు. పర్యావరణాన్ని కాపుడకోవటంతోపాటు, భూమి సారవంతాన్ని పెంచేందుకు రైతాంగం పచ్చిరొట్ట పైర్లను సాగు చేయటం మంచిది. పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంధ్రీయ విధానంలో పంటలను సాగు చేపడితే పెద్ద ఎత్తున దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.