
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగాల మండలం ఆవుసలికుంట గ్రామానికి చెందిన 12మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'బిమ్లా నాయక్' సినిమాలో మొగులయ్య పాడిన టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. ఈ సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. టైటిల్‌సాంగ్ సాకీని జానపద కళాకారుడు అద్భుతంగా ఆలపించాడు.
ఈ జానపద కళాకారుడు మొగులయ్య పల్లె నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చాడు.తండ్రి వాయించిన ఏడుమెట్ల కిన్నెర స్థానంలో మూడు ఆనపకాయ (సొరకాయ) బుర్రలను వెదురుబొంగుకు బిగించి 12 మెట్ల కిన్నెర తయారు చేశాడు మొగులయ్య. ఈయన చెప్పే వీరగాథల్లో పాలమూరు జిల్లా ప్రాంతంలో సుప్రసిద్ధమైన పండుగ సాయన్న కథ, మియాసాబ్ కథ, శంకరమ్మ కథ, వనపర్తి రాజుల కథలు అద్భుతమైనవి.
కొద్ది సంవత్సరాల కిందట మొగులయ్య కళను ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ పీహెచ్‌డీ స్కాలర్ వెలుగులోకి తీసుకొచ్చారు. నాటి నుంచి మొగులయ్య తన కళను పలు వేదికల మీద ప్రదర్శించి.. ప్రశంసలు పొందాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కళాకారుల సన్మాన కార్యక్రమంలో మొగులయ్యను కూడా సీఎం కేసీఆర్ సన్మానించారు. అంతరించిపోతున్న 12 మెట్ల కిన్నెర వాయిద్య కళారంగాన్ని నేటి సమాజానికి పరిచయం చేస్తున్నాడని పలువురు అభినందించారు.
అప్పటి నుంచి కళాకారులకు ఇచ్చే ప్రోత్సాహం కింద రూ.10 వేలు ఇస్తున్నారు. ఎన్నో వేదికల మీద తన కళను ప్రదర్శించిన మొగులయ్యకు అరుదైన అవకాశం లభించింది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ చిత్రం టైటిల్ సాంగ్‌లో సాకి పాడే అవకాశాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కల్పించారు.