సినిమా గుర్రం మృతి..దర్శకుడు మణిరత్నంపై కేసు

సినిమా షూటింగ్‌ల సమయంలో మూగజీవాలను వాడితే అత్యం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జంతువులకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేకర్స్‌పై ఉంటుంది. అందుకే చాలా వరకు జంతువుల సన్నివేశాల్లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో ఓ గుర్రం మరణించింది. దీంతో పెటా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో మణిరత్నంపై కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. తమిళ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గత నెల రోజులుగా జరుగుతోంది. ఈ సినిమాలో వచ్చే భారీ యుద్ధ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్‌ నగరానికి చెంది 50 గుర్రాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత నెల 11వ తేదీని ఓ గుర్రం డీహైడ్రేషన్‌ కారణంగా షూటింగ్‌ స్పాట్‌లోనే మరణించింది.

దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్‌ గుర్రాన్ని గుంత తీసి పూడ్చేశారు. అయితే షూటింగ్‌లో పాల్గొన్న కొందరు ఈ విషయాన్ని ‘పెటా’ ప్రతినిధులకు తెలిపారు. గత 18న అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌కు వెళ్లి పిటిషన్‌ ఇచ్చారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మద్రాస్‌ టాకీస్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ మేనేజ్‌మెంట్‌, గుర్రం యజమానిపై సెక్షన్‌ 429, సెక్షన్‌ 11 పీసీఏ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. అనంతరం మరణించిన గుర్రానికి పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం వివరాలు రావాల్సి ఉంది. మద్రాస్‌ టాకీస్‌ ప్రొడక్షన్‌ను మణిరత్నం స్థాపించిన విషయం తెలిసిందే.

News Tags: