మారునున్న విజయవాడ ప్రభుత్వాసుపత్రి రూపురేఖలు

విజయవాడ ప్రభుత్వాసుపత్రి రూపు రేఖలు మారబోతున్నాయా...ఏపి రాజధాని విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ప్రభుత్వాసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రికి ధీటుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఏపి ప్రభుత్వం చేయబోతుందా అంటే...అవుననే అనిపిస్తుంది... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి విషయంలో ప్రధానంగా ధృష్టి సారించారు.  కనీస సౌకర్యాలు లేక విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చికిత్సల నిమిత్తం రోగులు వెళ్ళలేని పరిస్ధితి. చిన్న శస్త్ర చికిత్సకు సైతం వెళితే కార్పోరేట్ ఆసుపత్రికి లేకుంటే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. రోజుకు వందలాది మంది రోగులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి అత్యవసర వైద్యం నిమిత్తం వచ్చినప్పటికీ సరైన చికిత్సలు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అందక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్ధితి నెలకొంది. రాజధాని నగరంలో ఎంతో మంది అధికారులు, విఐపిలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వసుపత్రిలో కనీస వైద్య సేవలు లేకపోవటాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపై స్పందించిన సియం విజయవాడ ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. 

ఈ క్రమంలోనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి సూపరింటెండ్ గా సీనియర్ వైద్యులు డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. డాక్టర్ కిరణ్ కుమార్ గతంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జనరల్ సర్జన్ గా వైద్య సేవలు అందించారు. అప్పట్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి ఆయన ఎంతగానో పాటు పడ్డారు. ఆరోగ్య శ్రీ క్రింద ఆపరేషన్ లు నిర్వహించటం ద్వారా వచ్చిన డబ్బును సైతం ఆయన ప్రభుత్వాసుపత్రికి అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. ఈ క్రమంలో అకింతభావంతో పనిచేసే వైద్యుడైతేనే విజయవాడ ప్రభుత్వాసుపత్రి దశదిశ మార్చవచ్చని బావించిన వైద్యఆరోగ్యశాఖ డాక్టర్ కిరణ్ కుమార్ కు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించింది. 

సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కిరణ్ కుమార్ ఆసుపత్రి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రిలో సిబ్బంది తక్కువ గా ఉండటం, ఉన్న సిబ్బందిపై పని వత్తిడి పెరగటం వంటి వాటిని గమనించారు. సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావటంతో తక్షణమే అదనపు సిబ్బంది నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రిలో పరిశుభ్రత సరిగా లేకపోవటంతో దానిని గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే విజయవాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం జరిగింది. అయితే దీనిని ఇప్పటి వరకు కరోనా కోసం వినియోగించారు. అయితే తర్వలో ఆ బ్లాక్ ను పూర్తి స్ధాయిలో వైద్య సేవలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేసేలా వైద్యుల నియామకం, పరికరాలను సమకూర్చుకోవాలన్న ఆలోచనతో అధికారులకు ప్రతిపాదనలు అందించారు. 20 పడకలతో కొత్త క్యాజువాలీటీని జనవరిలో అందుబాటులోకి తీసుకురాన్నారు. 

విజయవాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టినట్లు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిని రానున్న రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రోజుకు 100కు పైగా సర్జరీలు జరుగుతున్నాయని , రానున్న రోజుల్లో కీలకమైన గుండె, కీడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ఆసుపత్రి పరంగా సన్నధ్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 

News Tags: