గుంటూరులో కేబుల్ వార్...అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంత్రి ముఖ్యఅనుచరుడి హల్చల్

గుంటూరు నగరంలో కేబుల్ వార్ మరోమారు తెరమీదకు వచ్చింది. అధికార పార్టీకి చెందిన మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅనుచరిడిగా ఉన్న డైమెండ్ బాబు ప్రస్తుతం నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ పదవిలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ డిజిటల్ నెట్ వర్క్ పేరుతో తన కనుసన్నల్లోనడుస్తున్న కేబుల్ నెట్ వర్క్ విస్తరించుకునే క్రమంలో భాగంగా ఇప్పటికే గుంటూరు నగర పరిధితోపాటు రూరల్ ప్రాంతాలలో విస్తరించి ఉన్న సిటికేబుల్ పై కన్నేశాడు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా తన నెట్ వర్క్ విస్తరించటానికి కావాల్సిన కనెక్షన్లను సిటీకేబుల్ ఆపరేటర్లు వదులుకోవాలంటూ వత్తిడితెస్తున్నాడు. దీనికి ఆపరేటర్లు ససేమిరా ఒప్పుకోక పోవటంతో ఎదో విధంగా సిటీకేబుల్ నెట్ వర్క్ ను దెబ్బతీయాలన్న పన్నాగాలను పన్నుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే తన అధికారాన్ని ఉపయోగించి విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి విద్యుత్ పోల్స్ పై అడ్డుగా ఉన్నయన్న సాకుతో  సిటీకేబుల్ వైర్లను కత్తిరించేలా చేశాడు. 

గుంటూరులో నిలచిపోయిన కేబుల్, ఇంటర్నెట్ ప్రసారాలు, విఐపీలకు తప్పని ఇబ్బందులు

ఈరోజు ఉదయం తెల్లవారు జాము నుండి గుంటూరు నగరంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాలలో సిటీకేబుల్ వైర్లను విద్యుత్ పోల్స్ పై నుండి విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడికక్కడ వైర్లను కత్తిరించి వేయటంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో కేబుల్ తోపాటు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో స్ధానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విఐపీలు ఉండే ప్రాంతాల్లో సైతం కేేబుల్, ఇంటర్నెట్ సేవలు నిలిచి పోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కలెక్టర్, ఎస్.పితోపాటు ఇతర ప్రభుత్వకార్యాలయాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. వార్తలు, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు చూడలేకపోవటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

కోర్టు స్టే ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ అధికారులు

గతంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పోల్స్ పై ఇష్టారీతిలో ఉన్న విద్యుత్ వైర్లను క్రమబద్ధీకరించాలని అదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలపై కేబుల్ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించటంతోొ కోర్టు విద్యుత్ శాఖ ఇచ్చిన అదేశాలపై స్టే విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం స్టే అమలులో ఉన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కి విద్యుత్ శాఖ అధికారులు పై నుండి తమకు ఒత్తిడులు ఉన్నాయంటూ కేవలంలో నగరంలోని ప్రధానమైన సిటీకేబుల్ నెట్వర్క్ కు సంబంధించిన కేబుల్ వైర్లను మాత్రమే కటింగ్ చేస్తూ హల్ చల్ చేశారు. దాదాపు 100 ప్రాంతాల్లో కేబుల్ వైర్లను స్తంభాలపైకి ఎక్కి కట్ చేయటంతో కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. నగరంలో అనేక కేబుల్ నెట్ వర్క్ లకు సంబంధించిన వైర్లు స్థంభాలపై ఉన్నప్పటికీ కేవలం సిటీకేబుల్ వైర్లు మాత్రమే కటింగ్ చేయటం ఏంటని సిటీకేబుల్ ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. అధికారం ఉందికదా అని కొందరు పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటాన్ని వారంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. 

కేబుల్ వైర్ల కటింగ్ వ్యవహారమంతా  అమాత్యుని కన్నుసన్నల్లోనే...

నెక్ట్స్ డిజిటల్ పేరుతో తన కనుసన్నల్లో నడుస్తున్న కేబుల్ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమెండ్ బాబు గతకొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సిటీకేబుల్  కేబుల్ ఆపరేటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే పలువురు ఆపరేటర్లపై వత్తిడిపెట్టే ప్రయత్నాలు చేశాడు. అయితే సిటీకేబుల్ ఆపరేటర్లు దీనికి ససేమిరా నిరాకరించారు. గుంటూరులో సిటికేబుల్  వ్యవస్ధ ఎన్నో ఏళ్ళుగా బలంగా ఉండటంతో దానిని దెబ్బతీయటం, వారి కేబుల్ ఆపరేటర్లను తనవైపు తిప్పుకోవటానికి డైమండ్ బాబు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో ఎలాగైనా సిటీకేబుల్ ను దెబ్బకొట్టాలనే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. ఈక్రమంలోనే విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈరోజు ఉదయం సిటీకేబుల్ వైర్లను నగరం తోపాటు, రూరల్ ప్రాంత పరిధిలో అనేక చోట్ల కట్ చేస్తూ వైర్లను తొలగించే డ్రైవ్ ను నిర్వహించారు. సిటీకేబుల్ వైర్లను మాత్రమే తొలగించటాన్ని బట్టి చూస్తే దీని వెనుక పెద్దల హస్తం కూడా ఉందన్న వాదన వినిపిస్తుంది. గతంలో కేబుల్ కార్యకలాపాలు నిర్వహించిన అంబటి రాంబాబు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మంత్రి అంబటికి ముఖ్య అనుచరుడన్న విషయం గుంటూరు జిల్లా వాసులందరికి విధితమే. మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడి వల్లే విద్యుత్ అధికారులు కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తే సిటీ కేబుల్ వైర్లను కత్తిరించారన్న వాదన వినిపిస్తుంది. 

కనెక్టన్ ఎవరిది తీసుకోవాలన్న విషయంలో కేబుల్ వినియోగదారులకు హక్కులు లేవా?

కొంతమంది పొలిటికల్ ప్రేరేపితంగా కేబుల్ వ్యవస్ధను ఏర్పాటు చేసి వారి కార్యకలాపాల విస్తరణకోసం ప్రత్యర్ధి కేబుల్ వ్యవస్ధను దెబ్బతీసే ప్రయత్నాలు చేసిన ఘటనలు గతంలో కూడా గుంటూరులో వెలుగుచూశాయి. అయితే ప్రతిసారీ కేబుల్ వ్యవస్ధను పోటీగా ఏర్పటు చేయటం, ప్రత్యర్ధి కేబుల్ వ్యవస్ధను దెబ్బతీయటం కొందరు కేబుల్ ఆపరేటర్లను, కనెక్టన్లను తమవైపు తిప్పుకోవటం కొన్నాళ్ళు ఆకార్యకలాపాలను కొనసాగించి చివరకు దానిని ప్రత్యర్ధి కేబుల్ వ్యవస్ధలకే అమ్మకానికి పెట్టి దబ్బులు దండుకోవటం కొందరు రాజకీయ ముసుగులో ఉన్న పెద్దలకు అలవాటుగా మారిపోయింది. ఇదే తరహాలోనే ప్రస్తుతం మరో ఎత్తుగడతో కేబుల్ కార్యకలాపాలను తెరముందుకు తీసుకువచ్చి దాని విస్తరణకోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

కేబుల్ ముసుగులో వారి అగడాలకు అడ్డుఅదుపులోకుండా పోయిందా...

కేబుల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ , రాజకీయ వ్యవహారాలకు దీనిని ఉపయోగించుకుంటూ కొందరు పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. సత్తెనపల్లి నుండి గత ఎన్నికల్లో పోటీచేసిన అంబటి రాంబాబు ఈ సారి గుంటూరు వెస్ట్ నుండి బరిలోకి దిగే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలోనే ఇప్పటి నుండే గుంటూరు నగరంలోని సమాచార వ్యవస్ధను తన గుప్పిట్లో పెట్టుకోవలన్న దురలోచనతో ప్రత్యర్ధి కేబుల్ వ్యవస్ధను కబళించాలన్న కుట్రకు తెరలేపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెదిరింపులకు సిటీకేబుల్ ఆపరేటర్లు ఏమాత్రం తలొగ్గకపోవటంతో విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కోర్టు స్టే కొనసాగుతున్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా సిటీకేబుల్ వైర్లను తొలగించేలా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిటీకేబుల్ వ్యవస్ధలో వైసీపీకి చెందిన కేబుల్ ఆపరేటర్లు సైతం ఉన్నారు. అయితే మంత్రి అంబటి ప్రోత్భలంతో అతని అనుచరుడిగా ఉన్న డైమండ్ బాబు వ్యవహరిస్తున్న తీరును వైసీపీ స్ధానిక నాయకులుగా ఉన్న కేబుల్ ఆపరేటర్లే తీవ్రంగా తప్పుపడుతున్నారు.

కేబుల్ ప్రసారాలు నిలిచిపోవటంతో మండిపడుతున్న గుంటూరు వాసులు

ఈ రోజు ఉదయం నుండి కేబుల్ ప్రసారాలు నిలిచిపోవటంతో స్ధానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. దీంతో వారంతా ప్రసారాలు పునరుద్ధరించాలంటూ కేబుల్ ఆపర్లకు ఉదయం నుండి ఫోన్ లు చేస్తున్నారు. విద్యుత్ అధికారులు అకస్మాత్తుగా వైర్లు కత్తిరించిన వైనాన్ని కేబుల్ ఆపరేటర్లు కేబుల్ వినియోగదారులుకు వివరిస్తున్నారు. గుంటూరు నగరంతోపాటు, రూరల్ ప్రాంతాల్లో తొలగించిన కేబుల్ వైర్లను పూర్తి స్ధాయిలో పునరుద్ధరించాలంటే నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సిటీకేబుల్ యాజమాన్యం చెబుతుంది. కోర్టు ఉత్తర్వులను సైతం విద్యుత్ అధికారులు పరిగణలోకి తీసుకోకుండా వైర్లను కట్ చేయటం సరైనది కాదని సిటీకేబుల్ ఆపరేటర్లు అంటున్నారు. 

 

News Tags: