ఉద్యోగుల ఉద్యమం సక్సెస్ వెనుక?.....

ఉద్యోగుల ఉద్యమ సక్సెస్ ప్రస్తుతం ఏపిలో చర్చనీయాంశంగా మారింది.  పోలీసులు  నిర్బంధాలను దాటికొని భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు  విజయవాడకు చేరుకొని, ప్రభుత్వంకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తున్నట్లు కనిపిస్తున్నది. 

ప్రభుత్వ ఆదేశాలను పోలీస్ వర్గాలు గాలికి వదిలేసి, ఉద్యోగుల `చలో విజయవాడ’ కార్యక్రమంకు సహకారం అందించినట్లు వెల్లడి అవుతున్నది. అంటే ఒక విధంగా రాష్ట్ర పోలీసులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై `తిరుగుబాటు’ ధోరణిని బహిరంగంగా ప్రకటించినట్లు స్పష్టం అవుతున్నది.

ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలు అన్ని పోలీసులకు కూడా వర్తించేవే కావడంతో వారికి సంఘీభావం వ్యక్తం చేశారా?  లేదా అడ్డదిడ్డంగా తమ రాజకీయ ప్రయోజనాలకోసం పోలీసులను వాడుకొంటూ, అనేక సందర్భాలలో తమను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్న ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రవేశాలను వ్యక్తం చేశారా? ఈ విషయమే తేల్చుకోలేక ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. 

ఉద్యోగ సంఘాలు పక్షం రోజుల ముందే `చలో విజయవాడ’ కార్యక్రమం ప్రకటించాయి. ప్రభుత్వం కూడా ముందు నుండే ఆ కార్యక్రమంలో బయలుదేరితే తీవ్ర పరిణామాలు ఉండగలవనే హెచ్చరికలు చేస్తూనే వస్తున్నది. పాల్గొనవద్దని స్వయంగా ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. బస్సులలో, రైళ్లలో, ఇతర వాహనాలపై విజయవాడకు వచ్చే వారిపై నిఘాకు ఏర్పాట్లు చేశారు. 

అయినా వేల సంఘాల్లో అకస్మాత్తుగా విజయవాడకు చేరుకొని, భారీ నిరసన ప్రదర్శనను ఏ విధంగా ప్రారంభించారు? ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసినా, ఎక్కడా పోలీసులతో వారు ఘర్షణకు దిగిన్నట్లు లేదు. యధాలాపంగా వాటిని తోసుకొంటూ వచ్చేసారు. పోలీసులే వారి ఉధృతికి తట్టుకోలేక చేతులెత్తాశామని చెబుతున్నారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం ఉయోగులు, పోలీసులు కలసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవహేళన చేసిన్నట్లు భావించవలసి వస్తున్నది. 

ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమం అనూహయంగా విజయవంతం  కావడంతో పోలీసు, నిఘా వర్గాల ఉన్నతాధికారులపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి  తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 15 రోజుల ముందుగా ఉద్యోగులు ప్రకటన చేసి బెజవాడకు రాగలిగారంటే ఇది పూర్తిగా మీ వైఫల్యమే అంటూ సీనియర్‌ ఐపీఎ్‌సల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. 

హిందూపురం ఉద్యోగులు బెంగుళూరులో, కర్నూలు వాళ్లు బళ్లారిలో రైళ్లు ఎక్కి వస్తుంటే గుర్తించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉందా?  అంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రైల్వేస్టేషన్లలో కాకుండా ఊరి బయట చైన్‌ లాగి ఎక్కడం, బెజవాడ చేరుకున్న తర్వాతా ఇదే విధానాన్ని అవలంబించి విజయం సాధించిన ఉద్యోగుల వ్యూహం సీఎంకు తీవ్ర అసహనం తెప్పించినట్లు తెలిసింది.

ఉద్యోగులకు చాలాచోట్ల పోలీసులే సహకరించారని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంవో ఉన్నతాధికారి ఒకరు ప్రస్తావించగా,

అని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎదురు ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఉన్నతాధికారులు సహితం ప్రభుత్వ వైఖరి పట్ల అసహనంగా ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రశ్నించే గొంతుకలను తమ ద్వారా అణచివేస్తున్న వైసీపీ సర్కారు తమకు కూడా ద్రోహం చేసిందని క్షేత్రస్థాయిలో పోలీసులు బలంగా భావిస్తున్నారు. కరోనా సమయంలో కుటుంబాలను సైతం వదిలి రోడ్లపై పనిచేసినా పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏ మాట అటుంచి, జిల్లా కేంద్రంలో పనిచేసే వారికి అలవెన్స్‌లు కూడా తగ్గించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

వీక్లీ ఆఫ్‌లపై జగన్‌ చేసుకున్నంత ప్రచారం దేశంలో ఏ సీఎం చేసుకోలేదని, ఒక్క జిల్లాలో అయినా వారాంతపు సెలవులు పోలీసులకు ఇస్తున్నారా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి లీవుల సరెండర్‌, టీఏలు, డీఏలు అన్నింటా అన్యాయమే జరుగుతోందంటుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసు శాఖలో 20వేల ఖాళీల గురించి మూడేళ్లుగా సీఎం చెబుతూనే ఉన్నా నోటిఫికేషన్‌ మాత్రం వెలువడలేదని గుర్తు చేస్తున్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులను అడ్డుకోవడానికి వారేమైనా సంఘ విద్రోహ శక్తులా అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

పోలీసులతో వ్యక్తమవుతున్న ధిక్కార ధోరణి అధికార పక్షంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. పోలీసులు సహాయ నిరాకరణ సాగిస్తే పరిపాలన కష్టం కాగలదని భావిస్తున్నారు. 

News Tags: