అయోమయంలో ఆంధ్ర బిజెపి

ఏపిలో భారతీయ జనతా పార్టీ పరిస్ధితి అయోమయంగా తయారైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని కేంద్రంలోని బిజెపి పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ భాజాపా పరిస్ధితి భిన్నంగా మారింది. అధికార సాధన దిశగా బిజెపి పెద్దలు ప్రయత్నాలు చేస్తుంటే స్ధానిక నేతలు కొందరు మాత్రం అధికార పార్టీ తొత్తులుగా మారారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి దారుణంగా తయారైనా బిజెపి రాష్ట్ర బాధ్యులు కనీసం నోరు పెదపకపోను, జరుగుతున్న అన్యాయాలను ఖండిచకపోవటాన్నిపార్టీలోని కొందరు నేతలు తీవ్రస్ధాయిలో తప్పుపడుతున్నారు. పరిణామాలు ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలమైన శక్తిగా ఎలా ఎదగగలుగుతుందని అంతర్మధనం చెందుతున్నారు. 

గతంలో రాష్ట్ర పార్టీ బాద్యునిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీని గ్రామస్ధాయి నుండి రాష్ట్ర స్ధాయి వరకు బలోపేతం చేయటంలో కీలకపాత్ర పోషించారు. ఒకప్పుడు ఆర్ ఎస్ ఎస్ కే పరిమితమైన బిజెపిని ప్రజల పార్టీగా మలచటంలో కొంత మేరకు ఆయన చేసిన కృషి ఏపిలో బిజెపి ఉనికిని కాపాడుకునేలా చేయగలిగింది. ఆతరువాత పార్టీ బాధ్యతలను చేపట్టిన సోము వీర్రాజు, ఆయన కోటరీ బిజెపిని బలోపేతం చేయటానికి బదులు బలహీనపరిచే దిశలో వారి వ్యవహారకార్యకలాపాలు ఉండటం బిజెపి శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. దిశానిర్ధేశం చేసే పఠిష్టమైన నాయకత్వం లేకపోవటంతో ఏపి బిజెపి పరిస్ధితి డోలాయమానంగా తయారైంది. అధికార పార్టీ వైకాపాకు,  బిజెపి మిత్రపక్షమా, లేక ప్రతిపక్షమా తేల్చుకోలేని అయోమయ పరిస్ధితుల్లో బిజెపి క్రింది స్ధాయి కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బాధ్యతగా నోరిప్పాల్సిన బిజెపి పెద్దలు ప్రేక్షపాత్ర వహిస్తూ మౌనంగా చూస్తూ ఉండటాన్ని బిజెపి క్యాడర్ జీర్ణించుకోలేక పోతుంది.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్ర పర్యటన బిజెపిలో అయోమయం సృష్టించింది. దీనికి ముఖ్యకారణం లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో బాగంగా జన ఆశీర్వాద యాత్ర పేరుతో కిషన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో పార్టీలో కొంతమేర మంచి స్పందనే లభించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జన ఆశీర్వాద యాత్ర పేరుతో కిషన్ రెడ్డి చేపట్టిన పర్యటన సొంతపార్టీలోనే విభిన్న వాదనలకు దారితీసింది. కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర కాస్త ’జగన్ ఆశీర్వాద యాత్రగా’ మారిపోయిందన్న వాదన బిజెపి క్యాడర్ నుండే వినిపిస్తుంది. కిషన్ రెడ్డి యాత్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భాజాపా కార్యకర్తలు తీవ్ర నిరుత్యాహానికి లోనయ్యారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన సమయంలో తాడేపల్లి ప్యాలెస్ లో సియంతో ఏకాంత చర్చల పట్ల పార్టీ క్యాడర్ తోపాటు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయన్న వాదనను పార్టీలోని కొందరు నేతలు అంతర్గతంగా వ్యక్తపరుస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో బాగంగా ఏపికి వచ్చిన కిషన్ రెడ్డి , సియంను కలవటం ఏంటన్న అభిప్రాయం పార్టీనేతల్లోనే వ్యక్తమౌతుంది.

ఈ పరిణామాలతో బిజెపి శ్రేణులు ఒక్కసారిగా కలవరపాటుకు గురవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్ధితి ఇదే విధంగా ఉంటే బిజెపి గత అనుభవాన్ని చవిచూడాల్సి వస్తుందన్న వాదనను ఢిల్లీ పెద్లల దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. రాష్ట్రంలో రోజురోజుకు అధికార పార్టీపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయాత్నాలు సాగిస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో బలమైన పార్టీనేతలు ఉండీ బిజెపి మాత్రం ఎదుగుబొదుగులేకుండా గొర్రెతోక బెత్తడే అన్నచందంగా తయారైందని క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటకి పార్టీ బలోపేతమై రాష్ట్రంలో ప్రభలమైన శక్తిగా ఎదగాలంటే పఠిష్టమైన నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
 

News Tags: